“గూగుల్‌తో పాటు డీలర్‌షిప్‌లు కూడా ముఖ్యమే”: మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన టాటా హిటాచీ డీలర్‌షిప్ షోరూం, మెషిన్ కేర్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అభివృద్ధికి కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి వాడిన బుల్డోజర్‌లను, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అమరావతి, రోడ్ల అభివృద్ధి కోసం ఉపయోగిస్తోందని తెలిపారు.

మంగళగిరి అమరావతికి ముఖద్వారమని, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకోసిస్టమ్ ఇక్కడ సిద్ధంగా ఉందని లోకేశ్ అన్నారు. 2024 ఎన్నికల్లో తనను ఎంతోమంది పోటీ చేయవద్దని కోరినా, 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరితే, ఏకంగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారని గుర్తు చేసుకున్నారు. ఇంటి పట్టాలు, వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మంగళగిరిలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నామని అన్నారు.

“గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు. వారు భవన నిర్మాణాలు చేయాలంటే ఎకో సిస్టమ్ కావాలి. ఇదే ఎక్స్‌కవేటర్, బుల్డోజర్ కూడా అవసరం. దానికి సర్వీస్ సెంటర్ కావాలి. గూగుల్ ఎంత ముఖ్యమో ఈ డీలర్ షిప్ కూడా అంతే ముఖ్యం,” అని లోకేశ్ అన్నారు. డీలర్‌షిప్‌ల వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ప్రతి ఉద్యోగం ఎంతో ముఖ్యం అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, మొత్తం ఎకోసిస్టమ్ వస్తేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు