తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ గాయని, నటిగా పేరు గడించిన రావు బాల సరస్వతి దేవి ఈరోజు 97 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928 ఆగస్టు 29న జన్మించిన ఆమె కేవలం ఆరేళ్లకే పాటలు పాడటం మొదలుపెట్టి, ‘సతీ అనసూయ’ చిత్రంలో తన ప్రస్థానాన్ని ఆరంభించారు.
తెలుగులో తొలి నేపథ్య గాయనిగా చరిత్రకెక్కిన రావు బాలసరస్వతి, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర అనేక భాషల్లో వేల పాటలు పాడి తన స్వర మాధుర్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1934లో వీరి కుటుంబం గుంటూరు తరలిరాగా, 1944లో తిరిగి మద్రాస్ చేరుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన సి.పుల్లయ్య (చిత్తజల్లు పుల్లయ్య) ఆమెకు ‘సతీ అనసూయ’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమె వయసు కేవలం ఏడేళ్లు మాత్రమే. 1944లో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం బాలసరస్వతి లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి.
ఆమె మరణవార్త సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కలచివేసింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎనిమిది దశాబ్దాల కిందటే తెలుగు, తమిళ చలన చిత్రాల్లో నటించిన శ్రీమతి బాలసరస్వతి గారు లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు.









