కర్నూలు జిల్లా నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. “మన అందరి భవిష్యత్తును కాపాడే నాయకుడు ప్రధాని మోదీ,” అని పేర్కొన్నారు. అలాగే, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని తెలిపారు. ఈ ‘సూపర్ సేవింగ్స్’ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, “25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదు,” అని అన్నారు. సరైన సమయంలో, దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ అని, ఆయన వంటి నాయకుడిని పొందడం దేశం చేసుకున్న అదృష్టమని అభివర్ణించారు. తాను చాలా మంది ప్రధానులతో కలిసి పనిచేసినా, మోదీ వంటి నాయకుడిని చూడలేదన్నారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేసే వ్యక్తి ప్రధాని అని పేర్కొన్నారు.
జీఎస్టీ సంస్కరణల గురించి మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు పరిధిలోకి వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా జీఎస్టీ బచత్ ఉత్సవ్ (పొదుపు పండుగ), భరోసా ఉత్సవ్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. చివరగా, రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కారుతో డబుల్ బెనిఫిట్ వచ్చిందని పేర్కొంటూ, మోదీ సంకల్పంతోనే భారత్ ప్రపంచంలో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరిందని, 2047 నాటికి భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.









