ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలులో జరిగిన “సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రశంసించారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించిన మోదీ, గత పదహారు నెలల్లో ఏపీలో అభివృద్ధి శరవేగంతో ముందుకు సాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనలో భాగంగా 21వ శతాబ్దం భారతీయుల శతాబ్దమని మోదీ పేర్కొన్నారు. కర్నూలు సభ వేదికగా రైలు, రోడ్డు, విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ పెరుగుతుందని, ముఖ్యంగా కర్నూలు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇటీవల గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని, అమెరికా బయట ఏపీలో తమ పెట్టుబడి ఎక్కువని గూగుల్ సీఈవో తనతో చెప్పారని మోదీ వివరించారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) మరియు కనెక్టివిటీ హబ్‌గా ఏర్పాటు కాబోతుందని మోదీ ప్రకటించారు. రాయలసీమ అభివృద్ధి కూడా జరగాలని కోరుకుంటున్నామని, కర్నూలులో ప్రారంభమైన పనులు రాయలసీమలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేకూర్చిందని విమర్శించిన మోదీ, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.









