మంచు లక్ష్మీ ప్రసన్న లీడ్ రోల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందింది. ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా కథ, స్క్రీన్ప్లే మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మరో ఆకర్షణ ఏమిటంటే, ఇందులో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ తొలిసారిగా ఒకే సినిమాలో స్క్రీన్ పంచుకున్నారు. తండ్రీ-కూతుళ్ల కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ దీపావళి సందర్భంగా ఇంటింటా ఎంటర్టైన్మెంట్ అందించడానికి ‘దక్ష’ మూవీ ఈ రోజు (అక్టోబర్ 17) నుంచే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నెల రోజుల లోపే ఓటీటీ ఆడియన్స్ కోసం అందుబాటులోకి రావడం విశేషం. ఈ చిత్రంలో మంచు లక్ష్మి, మోహన్ బాబులతో పాటు సముద్ర ఖని, సిద్ధిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మంచు లక్ష్మి పోషించిన సీఐ దక్ష పాత్ర, అలాగే మోహన్ బాబు చేసిన కీలకమైన రోల్ చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి.
ఈ సినిమా కథ ప్రధానంగా రెండు మర్డర్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. సీఐగా పని చేసే దక్ష (మంచు లక్ష్మి) హైదరాబాద్ నగరంలోని ఒక కంటైనర్ యార్డులో అనుమానాస్పదంగా చనిపోయిన ఒక వ్యక్తి కేసును టేకప్ చేస్తుంది. అమెరికా నుంచి వచ్చిన ఒక ఫార్మా కంపెనీకి చెందిన వ్యక్తి కూడా అచ్చం ఇలాగే అనుమానాస్పదంగా చనిపోతాడు. ఈ రెండు హత్యల వెనుక ఎవరున్నారు? అనే విషయాన్ని ఒక చిన్న క్లూ ఆధారంగా దక్ష ఇన్వెస్టిగేట్ చేయడం ఈ సినిమాలో ప్రధానాంశం. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ మేజర్ అట్రాక్షన్ కాగా, కొన్ని సీక్వెన్సెస్ ‘రా అండ్ రస్టిక్’గా ఉన్నాయనే రివ్యూస్ వచ్చాయి.









