జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ప్రచారంలో బీఆర్‌ఎస్ దూకుడు.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్

 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. బీఆర్‌ఎస్ జనరల్ సెక్రెటరీ సోమ భరత్ కుమార్ సమర్పించిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆమోదించారు. ఈ లిస్ట్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా ఉండటంతో, ఆయన ఉప-ఎన్నిక ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ రోడ్ షో లేదా భారీ సభతో ప్రచారం హోరెత్తే అవకాశం ఉందని, ఇది పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని నేతలు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్ విడుదల చేసిన ఈ జాబితాలో కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌)తో పాటు పార్టీకి చెందిన కీలక నాయకులు ఉన్నారు. వారిలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, మల్లారెడ్డి, ముహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి. ఈ ఉప-ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్, ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప-ఎన్నిక అనివార్యం కాగా, బీఆర్‌ఎస్ మిగతా పార్టీల కంట ముందుగానే గోపీనాథ్ భార్య సునీతకే టిక్కెట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో తమ పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశనం చేయగా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అక్టోబరు 21తో నామినేషన్ల గడువు ముగియగా, 150 మందికిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు