ఖమేనీ సన్నిహితుడి కుమార్తె వివాహం: ఇరాన్‌లో హిజాబ్ చట్టంపై కొత్త వివాదం

అమెరికాతో శత్రుత్వం, కఠినమైన ఇస్లామిక్‌ చట్టాలు, హిజాబ్‌ నియమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇరాన్‌లో ఇప్పుడు అదే చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న పాలక వ్యవస్థపై ద్వంద్వ వైఖరి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం దేశ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన అలీ షామ్‌ఖానీ కుమార్తె వివాహం. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో షామ్‌ఖానీ కుమార్తె ఫాతిమె షామ్‌ఖానీ పాశ్చాత్య శైలిలోని తెల్ల గౌన్‌ ధరించి, హిజాబ్‌ లేకుండా కనిపించారు. ఆమె తల్లి కూడా నీలి రంగు లేస్‌ గౌన్‌లో హిజాబ్‌ లేకుండానే కనిపించడం విమర్శలకు దారితీసింది.

ఈ వివాహం 2024లో తెహ్రాన్‌లోని ఎస్పినాస్‌ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగినట్లు సమాచారం. వీడియోలో అలీ షామ్‌ఖానీ స్వయంగా తన కుమార్తెను వివాహ మండపానికి తీసుకువెళ్తూ కనిపిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి. సాధారణ మహిళలు తల కప్పుకోకుండా బయటకు వస్తే వెంటనే అరెస్టు అవుతుంటే, అధికార వర్గాలకు మాత్రం చట్టాలు వర్తించవని ప్రజలు ఆరోపిస్తున్నారు. “సాధారణ మహిళల జుట్టు కనిపించినా శిక్షిస్తారు, కానీ అధికారుల కుటుంబాలు మాత్రం పాశ్చాత్య వస్త్రధారణలో సేదతీరుతాయి” అంటూ సోషల్‌ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.

అలీ షామ్‌ఖానీ, ఇరాన్‌లోని జాతీయ భద్రతా మండలి మాజీ కార్యదర్శి. హిజాబ్‌ చట్టం అమలుకు ప్రధానంగా ప్రయత్నించిన వ్యక్తి ఆయనే. 2022లో మహ్సా అమిని మరణంతో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమైనప్పుడు, వాటిని అణిచివేయమని ఆదేశించిన వ్యక్తి కూడా షామ్‌ఖానీనే. ఇప్పుడు అదే వ్యక్తి కుటుంబం హిజాబ్‌ నియమాలను బేఖాతరు చేయడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ వీడియో బయటకు రావడంతో, ఇరాన్‌లో పాలకుల ద్వంద్వ వైఖరి, హిజాబ్‌ చట్టం న్యాయసిద్ధతపై మళ్లీ చర్చ మొదలైంది. “చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?” అనే ప్రశ్న మళ్లీ తలెత్తింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు