పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గిఫ్ట్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ టీజ్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో, బ్రీఫ్‌కేస్ పట్టుకుని, బ్రిటిష్ జెండాతో కప్పబడిన నేలపై నడుస్తున్నట్టుగా కనిపించారు. “1932 నుండి మోస్ట్ వాంటెడ్”, “ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్” అనే లైన్స్ పోస్టర్‌లో ఆసక్తిని రేకెత్తించాయి, ఈ పోస్టర్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్నాళ్లు ‘ప్రభాస్ హను’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్‌నే అధికారికంగా ఖరారు చేసి, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. పోస్టర్‌లోని ట్యాగ్‌లైన్‌లు మరియు ‘పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు’ అనే క్యాప్షన్ ఈ సినిమా కాన్సెప్ట్, టైమ్‌లైన్ పై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ‘1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు’ అనే వాక్యం కథా నేపథ్యాన్ని సూచిస్తోంది.
పోస్టర్‌లోని పదాలు ప్రభాస్ పాత్రలోని తిరుగుబాటు స్వభావాన్ని, బ్రిటిష్ ఆక్రమణదారుల నుండి భారతదేశానికి స్వేచ్ఛను సాధించాలనే తపనను సూచిస్తున్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ లైనప్‌లో ఈ సినిమా మరొక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారబోతోంది. మరోవైపు, ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి కూడా పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్‌డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









