అమెరికా విధించిన భారీ సుంకాలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమకు భారీ ఊరట లభించింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిషేధం తర్వాత, భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈ కీలక పరిణామం దేశీయ రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం వాటా కలిగిన ఏపీ రైతులకు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఈ శుభవార్తను స్వయంగా ప్రకటించారు.
2017 జనవరిలో కొన్ని రొయ్యల సరుకుల్లో ‘వైట్ స్పాట్ వైరస్’ గుర్తించడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి పొట్టు తీయని రొయ్యల దిగుమతులపై నిషేధం విధించింది. దీనికి తోడు, ఇటీవల అమెరికా ప్రభుత్వం భారత రొయ్యలపై భారీగా 59.72 శాతం వరకు సుంకాలు విధించడంతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మొన్న రష్యా, నేడు ఆస్ట్రేలియా మార్కెట్‌లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలురాయిగా నిలిచిందని సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.
అయితే, ఈ అనుమతులు కొన్ని కఠినమైన షరతులకు లోబడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, వ్యాధి రహిత జోన్లలో సేంద్రియ పద్ధతిలో పెంచిన రొయ్యలను మాత్రమే దిగుమతి చేసుకోవాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధన విధించింది. అలాగే, రొయ్యలను డీవెయిన్ చేసి, ఫ్రోజెన్ స్థితిలో పంపాలనే పాత షరతులు కూడా వర్తిస్తాయి. అమెరికా మార్కెట్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్న ఏపీ ఆక్వా రైతులకు ఈ తాజా పరిణామం కొత్త అవకాశాలను అందిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.









