జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో, ఎన్నికల ప్రచార వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, వారి వైఫల్యాలను, ‘బాకీ కార్డును’ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు వివరించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యం కాగా, ఆయన సతీమణి మాగంటి సునీతకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. పార్టీకి అనుకూలంగా సర్వేలు ఉన్నాయని, జూబ్లీహిల్స్‌లో గెలుపు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ లక్ష్య సాధన కోసం క్లస్టర్ల వారీగా, డివిజన్ల వారీగా ఇంఛార్జ్‌లను నియమించి ప్రచారం కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిస్తే భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ఈ ఉపఎన్నికను ఏ పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దని కేసీఆర్ నేతలకు నిర్దేశించారు.









