చిరంజీవి పేరు, ఫోటోలు, గొంతు వాడకంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు: లీగల్ టీమ్ అధికారిక ప్రకటన

మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫోటోలు, గొంతు, మ్యానరిజమ్స్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వాడకూడదని ఇటీవల కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మెగాస్టార్ లీగల్ టీమ్ అధికారిక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది. నలభై ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో విశిష్ట సేవలందించి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలు అందుకున్న చిరంజీవి గౌరవాన్ని కాపాడేందుకు కోర్టు జోక్యం కోరినట్లు లీగల్ టీమ్ పేర్కొంది.

చిరంజీవి పేరు, చిత్రం, ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై వినియోగించడం, అలాగే కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మార్ఫ్ చేసిన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేందుకు ఈ కోర్టు జోక్యం అవసరమైంది. ముఖ్యంగా డిజిటల్, ఏఐ వేదికల ద్వారా జరిగే వాణిజ్య దోపిడీ, తప్పుడు ప్రతిరూపణ వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది.

దీనితో, చిరంజీవికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, గొంతు, మ్యానరిజమ్స్, అలాగే ‘మెగాస్టార్’, ‘చిరు’, ‘అన్నయ్య’ వంటి బిరుదులను కూడా వాణిజ్య పరంగా లేదా ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా వాడుకోవడాన్ని కోర్టు నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎవరైనా చిరంజీవి గారి ఫోటోలు, ఏఐ దృశ్యాలు లాంటివి వాడితే కఠిన చర్యలు ఉంటాయని లీగల్ టీమ్ స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు