‘మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్: విద్యా సంస్థలకు సెలవు ఇవ్వండి – సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌కు ‘మొంథా’ తుఫాన్ పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ తుఫాను ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపనుందని, ముఖ్యంగా 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని, 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం తెలిపారు. వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా సమగ్ర సన్నాహక చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలని, రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం కింది స్థాయి వరకు చేరవేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని, కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండి, అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు