పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రం అద్భుత విజయాన్ని సాధించి, ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే, రాజకీయ బాధ్యతలు పెరగనున్న నేపథ్యంలో, ఆ తర్వాత పవన్ ఏ సినిమా చేస్తారనే చర్చ టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. తక్కువ కాల్షీట్లలో పూర్తి చేయగల స్క్రిప్ట్‌ల కోసం దర్శక-నిర్మాతలు పవన్ షెడ్యూల్ కోసం పోటీపడుతున్నారు.
ముందస్తు కమిట్మెంట్స్తో సురేందర్ రెడ్డి, సముద్రఖని
పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఇద్దరు దర్శకుల పేర్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు సురేందర్ రెడ్డి. ఈయన ఇప్పటికే పవన్ కోసం ఒక మాస్ కమర్షియల్ కథను సిద్ధం చేశారని, ఇది ముందస్తు కమిట్మెంట్స్లో భాగంగా ఉండటంతో, పవన్ షెడ్యూల్ ఖాళీ అవగానే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొకరు సముద్రఖని. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రో’ విజయానంతరం, వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేసే అవకాశం ఉందని, ఈ కాంబినేషన్‌ను దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దిల్ రాజు సపోర్ట్‌తో వంశీ పైడిపల్లి
తాజాగా ఈ రేసులోకి దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు వచ్చి చేరింది. విజయ్ ‘వారసుడు’ చిత్రం తర్వాత ఎక్కువగా ప్రాజెక్టుల నుండి దూరంగా ఉన్న వంశీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ కాంబినేషన్‌కు నిర్మాత దిల్ రాజు మద్దతుగా నిలుస్తున్నారు. దిల్ రాజుకు ఇప్పటికే ‘వకీల్ సాబ్’ ద్వారా పవన్‌తో తక్కువ సమయంలో పెద్ద మాస్-క్లాస్ సినిమాను పూర్తి చేసిన అనుభవం ఉంది. 2029 ఎన్నికల ముందు పవన్ రెండు సినిమాలు చేస్తే, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఖాయమవుతుందని, అయితే ఒక్క సినిమా మాత్రమే చేసే అవకాశం ఉంటే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.









