మొంథా తుఫాను ప్రభావం: తెలంగాణలో రేపు (అక్టోబర్ 30) కొన్ని జిల్లాలకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటన

మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఏపీలోని కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ తుఫాను అక్టోబరు 28 రాత్రి తీరం దాటిన తర్వాత, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు కారణమవుతోంది. దీంతో, విద్యార్థులు, తల్లిదండ్రులు రేపు (అక్టోబర్ 30) స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా రేపు, అనగా అక్టోబరు 30న, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇదే క్రమంలో, భారీ వర్షాల సూచన నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ జిల్లాలో కూడా ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి అధికారికంగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నందున, ఈ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించాలని పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా, భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు బయటకు అస్సలు రావద్దని సూచనలు జారీ అవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవుల విషయమై ప్రభుత్వం లేదా జిల్లా కలెక్టర్ల నుండి తదుపరి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు