కిడ్నీ మార్పిడి కోసం ప్రత్యామ్నాయాల పరిశోధనలో భాగంగా, జన్యు మార్పిడి చేసిన పంది మూత్రపిండం అమర్చిన అమెరికాకు చెందిన 67 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ అరుదైన రికార్డును నెలకొల్పారు. బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఈ ప్రయోగం జరిగింది. ఆండ్రూస్ రికార్డు స్థాయిలో 271 రోజులు (దాదాపు 9 నెలలు) పంది కిడ్నీతో జీవించారు. అనంతరం, కిడ్నీ పనితీరు క్షీణించడంతో వైద్యులు ఆ మూత్రపిండాన్ని తొలగించి, ఆండ్రూస్‌కు తిరిగి డయాలసిస్ చికిత్సను ప్రారంభించారు. ఈ సంఘటన, జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే జెనోట్రాన్స్ప్లాంట్ పరిశోధనల్లో ఒక కీలక ముందడుగుగా పరిగణించబడుతోంది.
టిమ్ ఆండ్రూస్ సుదీర్ఘ కాలంగా డయాబెటిస్తో బాధపడుతూ, చివరి దశ కిడ్నీ వ్యాధికి చేరుకున్నారు. డయాలసిస్‌పై ఆధారపడిన ఆయన, ఈ ప్రయోగం రిస్క్ అని తెలిసినా అంగీకరించారు. తాను డయాలసిస్ నుండి దూరంగా ఉండటంతో పాటు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఇతరులకు కూడా సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన జెనోట్రాన్స్ప్లాంట్కు ఒప్పుకున్నారు. అమెరికాలో పంది కిడ్నీ అమర్చిన నాల్గవ వ్యక్తి ఆండ్రూస్. గతంలో మూడవ రోగి 130 రోజులు జీవించి రికార్డు సృష్టించగా, ఆండ్రూస్ 271 రోజులు జీవించి ఆ రికార్డును అధిగమించారు.
ప్రస్తుతం కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రోగులకు ఈ ప్రయోగం ఆశాకిరణంగా నిలుస్తోంది. అమెరికాలోనే అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారిలో 90 వేల మందికి పైగా కిడ్నీ కోసమే వేచి ఉన్నారు. ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు జెనోట్రాన్స్ప్లాంట్పై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆండ్రూస్‌కు అమర్చిన పంది కిడ్నీకి 69 జీన్ ఎడిట్స్ చేసి, వైరస్‌లను తట్టుకునే విధంగా, మనిషి శరీరానికి సరిపోయే విధంగా మార్పులు చేశారు. అయితే, పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో మాత్రమే ఉన్నాయని, సాధారణ క్లినికల్ ప్రొసీజర్‌గా ఇంకా అందుబాటులోకి రాలేదని వైద్యులు తెలిపారు.









