మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నవీ ముంబై వేదికగా జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఓపెనర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్ మెరుపు శతకం (93 బంతుల్లో 119 రన్స్) తో పాటు ఎలీసా పెర్రీ (77), ఆష్లే గార్డ్‌నర్ (45 బంతుల్లో 63 రన్స్) అర్ధ సెంచరీలతో రాణించారు.
ఒక దశలో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు పరుగులు పారించడంతో, ఆ జట్టు 400 పరుగుల మార్క్‌పై కన్నేసినట్లు కనిపించింది. ముఖ్యంగా 27.1 ఓవర్లకు 180/1 తో పటిష్టంగా ఉన్న సమయంలో, భారత బౌలర్లు పుంజుకున్నారు. అయితే, ఆష్లే గార్డ్‌నర్ ధాటిగా ఆడి స్కోరును 300 మార్క్ దాటించింది. కానీ, గార్డ్‌నర్ రనౌట్ కావడంతో సీన్ రివర్స్ అయింది. చివర్లో భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ఆస్ట్రేలియా చివరి ఐదు వికెట్లను కేవలం 9 బంతుల్లోనే కోల్పోయి 350 మార్క్ కంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ప్రస్తుతం, మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగు పెట్టాలంటే భారత జట్టు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఇప్పటికే తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో తలపడనుంది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఫైనల్ చేరుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.









