బెంగళూరు హిట్ అండ్ రన్: 3 గంటలు రోడ్డుపైనే డెలివరీ బాయ్.. స్పందించకపోవడంతో మృతి

బెంగళూరులో ఇటీవల డెలివరీ ఏజెంట్ దర్శన్ ను కారుతో గుద్ది చంపిన ఘటనకు సంబంధించి గుండెలు పిండే విషాదం వెలుగులోకి వచ్చింది. దర్శన్ బైక్‌ను కారు సైడ్ మిర్రర్ తాకిందనే కోపంతో, మనోజ్ కుమార్ (32), అతని భార్య ఆరతి శర్మ (30) లు దర్శన్‌ను వెంటాడి మరీ కారుతో ఢీకొట్టి హత్య చేశారు. అయితే, ప్రమాదం తర్వాత దర్శన్ దాదాపు మూడు గంటల పాటు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, ఆ సమయంలో అటుగా వెళ్లిన వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదని మృతుడి బావమరిది మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే దర్శన్ ప్రాణాలతో బతికేవాడని వైద్యులు చెప్పినట్లు మహేష్ కన్నీటి పర్యంతమయ్యాడు, ఇది మనుషుల్లో మానవత్వంపై సందేహాలను పెంచుతోంది.

జెప్టోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల దర్శన్, రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకునేవాడు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో అతని స్నేహితుడు వరుణ్, రోడ్డు ప్రమాదం గురించి దర్శన్ బావమరిది మహేష్‌కు ఫోన్ చేసి చెప్పాడు. మహేష్ ఘటనా స్థలికి (జెపి నగర్ సెవెన్త్ ఫేజ్, శ్రీరామ లేఅవుట్) చేరుకునేసరికి దర్శన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే మహేష్ అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, 20 నిమిషాల ముందే దర్శన్ మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కారు అద్దానికి ఇచ్చిన ప్రాధాన్యతను, ఒక మనిషి ప్రాణానికి ఇవ్వకపోవడం అత్యంత రాక్షసత్వానికి అద్దం పట్టింది.

దర్శన్ మృతితో అతని కుటుంబం అనాథగా మారింది. రెండేళ్ల క్రితం తల్లిని కోల్పోయిన దర్శన్, కుటుంబాన్ని పోషించేందుకు నెలకి సుమారు ₹25,000 సంపాదించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. దర్శన్ కుటుంబానికి దిక్కు ఎవరు అని మహేష్ బోరున విలపించాడు. కారుతో గుద్ది చంపిన మనోజ్ కుమార్ మరియు ఆరతి శర్మ లను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ బావమరిది మృతికి న్యాయం జరగాలని, ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు