ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ వారం రోజుల పాటు సిడ్నీలోని హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో బలంగా నేలకు గుద్దుకోవడంతో అయ్యర్‌కు స్ప్లీన్ భాగంలో చిన్న గాయం ఏర్పడి, అంతర్గత రక్తస్రావం కూడా జరిగింది. వెంటనే స్పందించిన వైద్య నిపుణులు చిన్న ప్రొసీజర్ ద్వారా రక్తస్రావాన్ని ఆపి, ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు.
తాజాగా విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో బీసీసీఐ, శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, సిడ్నీ మరియు భారత వైద్య నిపుణులు ఆయన కోలుకుంటున్న తీరుపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. అయినప్పటికీ, ఆయన ఇప్పుడల్లా భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. అయ్యర్ ఫాలోఅప్ కన్సల్టేషన్ల కోసం సిడ్నీలోనే కొన్ని రోజులు ఉండి, ప్రయాణానికి ఫిట్‌గా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశానికి తిరిగి వస్తారని బీసీసీఐ తెలిపింది.
వైద్యుల అంచనా ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ సుమారు రెండు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా నవంబర్ 30న రాంచీలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ఆయన దూరమవుతారని సమాచారం. అయ్యర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, తాను క్రమంగా కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన అభిమానుల ప్రేమ, శ్రద్ధ తనకు ఎంతో బలం ఇస్తున్నాయని కృతజ్ఞతలు తెలియజేశారు.









