రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లోహమండి రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫుల్లుగా మద్యం సేవించిన ఒక ట్రక్కు డ్రైవర్ వాహనాలను ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించాడు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, మరో 50 మందికి గాయాలయ్యాయి. ట్రక్కు డ్రైవర్ సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలను ఈడ్చుకుంటూ వెళ్లాడని స్థానికులు తెలిపారు.
లోహమండి రోడ్డుపై ట్రక్కు డ్రైవర్ వేగంగా వాహనాన్ని తీసుకెళ్తున్న సమయంలో అది అదుపుతప్పి, కార్లు, మోటార్‌సైకిళ్లు సహా అనేక వాహనాలను ఢీకొట్టింది. ట్రక్కుకు ఎదురైన ప్రతి వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో పలు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయాయి. చివరకు ఒక చోట ట్రక్ ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి, గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, మద్యం సేవించాడా అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. రాజస్థాన్‌లో వరుసగా రెండో రోజు భారీ ప్రమాదం జరగగా, నిన్న ఫాలోడిలో జరిగిన యాక్సిడెంట్‌లో 15 మంది మరణించారు. మరోవైపు, ఇవాళ ఉదయం తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ 21 మంది ప్రాణాలు కోల్పోవడం దేశంలో రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.









