ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ (SLBC) ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. సమైక్య పాలకులు దత్తత పేరుతో కోతలు కోశారని విమర్శిస్తూ, “నీళ్ల శాఖ మంత్రికి జ్ఞానం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్లు అంటే భయం” అంటూ ఎద్దేవా చేశారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.

తాజాగా జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ, “చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు పోలేదు?” అని జగదీశ్ రెడ్డి నిలదీశారు. అంతేకాకుండా, “తెలంగాణ నీళ్లను గురుదక్షిణ కింద చంద్రబాబుకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు?” అని ప్రశ్నించారు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయన పాత గురువు చంద్రబాబు, కొత్త గురువు కాంగ్రెస్ నిర్వాకంతోనే పాలమూరుకు నీళ్లు రాలేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

“శక్తికి మించిన పదవి రేవంత్ రెడ్డికి వచ్చింది. పదవుల కోసం, పైసల కోసం అమ్ముడుపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది” అని ఆరోపించిన జగదీశ్ రెడ్డి, ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనడం లేదని, రైతులను దళారులకు పంటను అమ్మేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే, ప్రైవేటు కళాశాలలు, పత్తి మిల్లులు బంద్ అవుతున్నా, రేవంత్ రెడ్డి, మంత్రులు గాలి మొటార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. “జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం” అని జగదీశ్ రెడ్డి ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు