వైసీపీ కీలక నేత, మాజీమంత్రి కొడాలి నాని అనుచరుడైన గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావుపై నకిలీ పోలీసు అవతారమెత్తి బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ మండలం మోటూరులో జరిగిన ఈ ఘటనలో, తాను ఎస్ఐ అంటూ ఆలయ పూజారిని బెదిరించినట్లు తెలుస్తోంది.
గంటా శ్రీనినివాసరావు పూజారిని బెదిరించి, ఆలయ తాళాలు లాక్కొని, గుడిలోని వాటర్ బోర్, మోటార్‌ను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుడు వెంకటరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, కొడాలి నాని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన గంటా శ్రీనివాసరావు, గుడివాడ నియోజకవర్గ వైసీపీ ప్రచార విభాగ అధ్యక్షుడిగా ఉన్నాడు. నకిలీ పోలీసు అవతారమెత్తి బెదిరింపులు, గుడిలో వస్తువుల అపహరణ వంటి చర్యలకు పాల్పడినందుకు అతడిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.









