బిహార్ ఎన్నికల ఎఫెక్ట్: స్వస్థలాలకు వలస కార్మికులు, హైదరాబాద్‌లో మందగించిన పనులు

దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, గార్మెంట్స్ వంటి అనేక రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న బిహార్ వలస కార్మికులు ప్రస్తుతం తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున పయనమవుతున్నారు. ఈ నెల నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఓటు హక్కు వినియోగించుకోవడానికి, అలాగే పండుగ సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో సమయం గడపాలనే ఉద్దేశంతో వీరు ప్రయాణం మొదలుపెట్టారు. వీరి ప్రయాణాల కారణంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నిర్మాణం, కూలీ పనులు, హోటల్ రంగంపై తాత్కాలిక ప్రభావం పడుతోంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే దాదాపు 8 లక్షల మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగానికి చెందినవారే. ఎన్నికల కారణంగా వీరు దాదాపు 10 రోజులపాటు గైర్హాజరు అవుతారని అంచనా. ఫలితంగా నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యమవుతాయని, కాంట్రాక్టర్లకు అదనపు వ్యయం వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో రోజువారీ పనులపై ఆధారపడే మిగిలిన స్థానిక కార్మికులకూ పనులు తగ్గే అవకాశం ఉంది.

హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, కార్మికులు తిరిగి చేరేవరకు పని ఉత్పాదకత 30–40% వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వలస కార్మికుల సంఖ్య, వారు పనిచేసే కీలక రంగాలు కారణంగా బిహార్ ఎన్నికల ప్రభావం నగర ఆర్థిక వ్యవస్థపై తాత్కాలికంగా పడుతోంది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు