తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్ శర్వాహోమ్స్ కాలనీలో నివసిస్తున్న మనీషా అనే వివాహిత చీమల భయంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీకాంత్, నాలుగేళ్ల కుమార్తెతో సంతోషంగా ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా ఆమె చీమలను చూస్తే వణుకుతూ, భయంతో ఏడుస్తుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నా భయం తగ్గకపోవడంతో, ఆమె ఆత్మస్థైర్యం కోల్పోయి, చిన్న విషయాలకే ఉలిక్కిపడే స్థితికి చేరింది.
చీమల భయం మరింత పెరగడంతో, ఇంట్లో చీమలు కనిపిస్తే వాటిని చంపమని భర్తను వేడుకునేది. బయట వ్యక్తులు తన భయాన్ని చూసి హేళన చేయడంతో మనీషా మానసికంగా మరింత కుంగిపోయింది. చివరికి, భర్త ఆఫీసుకెళ్లిన సమయంలో, భరించలేని మానసిక బాధతో ఆమె బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ లెటర్‌లో, “చీమలకు భయపడి బతకడం కష్టం, ఇక నా వల్ల కాదు” అంటూ పేర్కొంది.
సాయంత్రం భర్త శ్రీకాంత్ ఇంటికి తిరిగి వచ్చి, తలుపు బలవంతంగా తెరిచి చూడగా, మనీషా ఉరివేసుకున్న దృశ్యం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, పటాన్‌చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చిన్నపాటి భయాలు మరియు మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో వ్యక్తిని ప్రభావితం చేయగలవో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసిందని, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వెంటనే సైకాలజికల్ కౌన్సెలింగ్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.









