దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలు తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి ఎయిర్‌పోర్టులలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS) అకస్మాత్తుగా పనిచేయకపోవడం వల్ల విమానాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విమాన ప్రణాళికలు, గగనతలం నియంత్రణ వంటి కీలక కార్యకలాపాలకు ఇది నడిమి బిందువుగా ఉండటంతో, ఈ లోపం వల్ల దేశవ్యాప్తంగా 800కి పైగా విమానాలు రద్దు లేదా ఆలస్యం కావడంతో వేలాది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి నిలిచిపోయారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఈ గందరగోళం నెలకొంది.
ఈ సాంకేతిక పరిణామాల ప్రభావం హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికీ చేరింది. ఇక్కడ కూడా కౌలాలంపూర్, వియత్నాం, గోవా, ఢిల్లీ, ముంబై వంటి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు ముందస్తు సమాచారం లేకుండానే రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నించారు. సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది సిబ్బంది దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. సాంకేతిక కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు చెప్పినప్పటికీ, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమైంది.
ఇక ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో AMSS సమస్య క్రమంగా పరిష్కారమవుతోందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ ఘటనపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల సాంకేతిక వ్యవస్థలను సమీక్షించాలని నిర్ణయించింది. వరుసగా ఇలాంటి ఆటోమేషన్ వైఫల్యాలు జరగడం దేశ విమానయాన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ATC సాంకేతిక మౌలిక సదుపాయాల ఆధునీకరణ, సైబర్ భద్రత బలోపేతం, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను బలపర్చే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.









