తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శాతవాహన యూనివర్సిటీ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ, యూనివర్సిటీ యొక్క రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. 25 మందికి పీహెచ్‌డీ పట్టాలు, అలాగే 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్ తమ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థుల శ్రద్ధ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వారిని విజయం దిశగా నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనలు, శ్రమ, సృజనాత్మకత వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్తాయని, విద్యార్థుల మేధాశక్తియే వారికి ప్రయోగశాలగా పనిచేయాలని అభివర్ణించారు. విద్యారంగం కేవలం బోర్డు, చాక్ పీస్‌లకే పరిమితం కాకుండా, సాంకేతికతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డిజిటల్ లెర్నింగ్ వల్ల భౌగోళిక అవరోధాలు తొలగిపోయాయని, ప్రతి విద్యార్థి నైపుణ్యం, నిరంతర అభ్యాసాలే విజయానికి దోహదం చేస్తాయని తెలిపారు. ప్రపంచ విజ్ఞానాన్ని ఆహ్వానించాలని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని, అదే సమయంలో తెలంగాణ మట్టి పరిమళాన్ని మరవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు.
చివరగా, అందరూ సమానంగా జీవించే సమాజమే నిజమైన అభివృద్ధి అని గవర్నర్ తెలిపారు. ప్రతిభ ఎక్కడైనా వికసిస్తుందని, విద్యార్థులు భయాన్ని, అలసటను అధిగమించి ముందుకు సాగాలని ఉద్బోధించారు. విశ్వవిద్యాలయానికి న్యాక్ (NAAC), ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు కృషి చేయాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. గోల్డ్ మెడల్, పీహెచ్‌డీ పట్టాలు అందుకున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.









