ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ప్రధానమంత్రి మోదీ ఈ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. అంతేకాకుండా, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్‌తో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, పేలుడు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
పేలుడు సంభవించిన చోటుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్ మరియు డీఐజీ సీఆర్పీఎఫ్ అధికారులు చేరుకున్నారు. అయితే, ఈ ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఏం చెప్పినా తొందరపాటు అవుతుందని సీఆర్పీఎఫ్ డీఐజీ కిశోర్ ప్రసాద్ అన్నారు. పేలుడు తర్వాత, రోడ్డుపై శరీర భాగాలు కనిపించాయని, అక్కడి పరిస్థితిని చూసి ప్రజలు షాక్ అయ్యారని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించాడు. “రోడ్డుపై ఒకరి చేయి రక్తపు మడుగులో కనిపించడం చూసి మేం షాకయ్యాం. మాటల్లో వివరించలేని విధంగా ఉంది” అని అతను తెలిపాడు.
పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రి వద్ద పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది.









