కార్తీక మాస పుణ్యదినాల సందర్భంగా శ్రీశైలం శ్రీబ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం మరోసారి భక్తజన సంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే రద్దీ అసాధారణంగా పెరగడంతో, ఆలయ ప్రాంగణం, ప్రధాన వీధులు మరియు పాతాళగంగ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయాయి.
భక్తులు ముందుగా పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించి, దీపాలు వదిలి, ఆ తర్వాత స్వామివారి ఆలయ దర్శనానికి చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి సగటున నాలుగు గంటల వరకు సమయం పడుతోంది. భక్తులు అలసిపోకుండా ఉండేందుకు ఆలయ అధికారులు క్యూలైన్లలో వేడి పాలు, తాగునీరు మరియు వైద్య సదుపాయాలు అందజేస్తున్నారు. భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి భావంతో క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, దేవస్థాన సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన రహదారులపై ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రద్దీతో శ్రీశైలం ప్రధాన వీధులు, మార్కెట్ ప్రాంతం మహాశివరాత్రి పర్వదినాన్ని తలపించేలా కనిపిస్తున్నాయి. హోటళ్ళు, వసతి గృహాలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.









