ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన ప్రకటనకు సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్ రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 2019లో ప్రాజెక్టులు నిలిపివేసిన ఒక ప్రముఖ కంపెనీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రాబోతోందని ఆయన ప్రకటించారు. ఈ సంస్థ రాక రాష్ట్రానికి ఒక ‘తుపానులా’ ఉండబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి లోకేశ్ తన పోస్ట్‌లో, “2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటలకు వేచి ఉండండి!!” అని పేర్కొన్నారు. ఆయన ఈ పోస్టుకు #InvestInAP మరియు #ChooseSpeedChooseAP వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌లు పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తూ, ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి.
2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం నుంచి కొన్ని కంపెనీలు వెళ్లిపోయాయని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆగిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, మంత్రి లోకేశ్ ప్రకటించిన ఆ సంస్థ ఏది, మరియు ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతోంది అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే రేపు ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.









