రెడ్‌ఫోర్ట్ పేలుడు: 26/11 తరహా దాడులకు జైష్-ఎ-మొహమ్మద్ కుట్ర

ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన వెనుక 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస దాడులకు కుట్ర దాగి ఉందని దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ దాడిలో ఇప్పటికే 13 మంది మరణించారు. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రసంస్థకు ఈ కుట్రతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రవాద బృందం ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోడానికి ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో కూడా దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు తేలింది.

ఈ ఉగ్రకుట్ర జనవరి నెల నుంచి కొనసాగుతోందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఏకంగా 200 శక్తివంతమైన ఐఈడీలను (బాంబులు) తయారు చేసేందుకు సన్నాహాలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియన్, అనంత్‌నాగ్‌లకు చెందిన కొంతమంది రాడికలైజ్డ్ డాక్టర్లను ఈ పనికి ఎంచుకున్నారు. వారి “వైట్ కాలర్” (వైద్యులు) హోదా కారణంగా అనుమానం రాకుండా సులభంగా ఎన్‌సిఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) చుట్టూ తిరగవచ్చని వారు భావించారు. పేలుడు పదార్థాలను నిల్వ చేయడానికి వారు ఫరీదాబాద్‌లోని ధౌజ్ మరియు ఫతేపూర్ తగా ప్రాంతాలలో గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.

నవంబర్ 10న జరిగిన పేలుడులో మరణించిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని, ఇతనే ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. అరెస్టు చేసిన అనుమానితుల్లో డాక్టర్లు అయిన షాహీన్ సయీద్, ముజమ్మిల్ షకీల్ గనాయి, అదీల్ రథర్ ఉన్నారు. వాస్తవానికి, ఉగ్రవాదులు మొదట దీపావళి పండుగ సమయంలో దాడులు చేయాలని ప్లాన్ చేసినా, అది విఫలమైనట్లు అరెస్టయిన ముజమ్మిల్ ద్వారా తెలిసిందని వర్గాలు తెలిపాయి. అతని వద్ద బాంబుల తయారీకి ఉపయోగించే 2,900 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. డాక్టర్ సయీద్ కారులో రైఫిల్, మందుగుండు సామగ్రి లభించగా, ఆమెకు జైష్-ఎ-మొహమ్మద్ కోసం మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించినట్లు తర్వాత తేలింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు