గువాహటి టెస్ట్: వెలుతురు సమస్య కారణంగా లంచ్‌కు ముందే టీ బ్రేక్!

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా నవంబర్ 22న ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ టైమింగ్స్‌లో బీసీసీఐ అనూహ్య మార్పులు చేసింది. సాధారణంగా లంచ్ విరామం తర్వాత వచ్చే టీ బ్రేక్‌ను ఈసారి లంచ్‌కు ముందే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కీలక మార్పుకు ప్రధాన కారణం వెలుతురు సమస్య అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. గువాహటిలో శీతాకాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా ముందుగా జరగడం వల్ల సాయంత్రం 4 గంటల సమీపంలో వెలుతురు తగ్గి, ఆట నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది.

గువాహటి టెస్ట్‌ కోసం నిర్ణయించిన కొత్త షెడ్యూల్ ప్రకారం, మ్యాచ్ ఆరంభ సమయాన్ని అరగంట ముందుకు తీసుకొచ్చి ఉదయం 9:00 గంటలకు నిర్ణయించారు. టాస్ ఉదయం 8:30 గంటలకు పడుతుంది. తొలి సెషన్ ఉదయం 9:00 నుంచి 11:00 వరకు జరగగా, ఆ తర్వాత 20 నిమిషాల టీ విరామం (11:00–11:20) ఉంటుంది. రెండో సెషన్ 11:20 నుంచి 1:20 వరకు, ఆ తర్వాత లంచ్ విరామం (1:20 నుంచి 2:00) ఉంటుంది. మూడవ సెషన్ 2:00 నుంచి 4:00 గంటల వరకు జరుగుతుంది. పూర్తి ఓవర్లను ఆడటానికి అవసరమైతే అదనంగా 30 నిమిషాల సమయం ఇచ్చే అవకాశం ఉంది.

గువాహటి నగరం టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వెలుతురు సమస్య కారణంగా డే మ్యాచ్‌లో కూడా ఈ విధంగా లంచ్‌కు ముందే టీ బ్రేక్ ఇవ్వడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నేపథ్యంలో ఇరు జట్లకు చాలా కీలకం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు