ఢిల్లీ పేలుడు కేసు: డాక్టర్ షహీన్ సయీద్ డబుల్ లైఫ్ బట్టబయలు

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసు దర్యాప్తులో ప్రధాన నిందితురాలు డాక్టర్ షహీన్ సయీద్ యొక్క ద్విముఖ జీవితం (డబుల్ లైఫ్) వెలుగులోకి వచ్చింది. ఆమె పగలు వైద్యురాలిగా పనిచేస్తూ, ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల తర్వాత ఫరీదాబాద్‌లోని అల్-ఫలా మెడికల్ సైన్సెస్ కాలేజీలో తన ఉద్యోగం ముగిశాకే, తన ‘అసలు పని’ అయిన ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించేదని విచారణలో తేలింది. నిఘా వర్గాలు ఆమెను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి హెడ్‌గా గుర్తించాయి.

షహీన్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేదని ఆమె సహోద్యోగులు తెలిపారు. ఆమె ఎప్పుడూ ప్రార్థనలకు ఉపయోగించే తస్బీహ్ (జపమాల), హదీస్ పుస్తకాన్ని వెంట ఉంచుకునేదని, ఎవరికీ చెప్పకుండానే తరచూ బయటకు వెళ్లిపోయేదని పేర్కొన్నారు. షహీన్‌ను సోమవారం అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే, మరో ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఎర్రకోట వద్ద పేలుడు పదార్థాలతో నింపిన హ్యుందాయ్ ఐ20 కారుతో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో షహీన్‌తో పాటు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ అహ్మద్‌లను అరెస్ట్ చేయడంతో ‘వైట్ కాలర్ టెర్రరిజం’ కోణం తెరపైకి వచ్చింది.

ఈ ఉగ్రకుట్రకు ఉపయోగించిన రెండు కార్లు (మారుతీ బ్రెజా మరియు మారుతీ స్విఫ్ట్ డిజైర్) షహీన్ పేరు మీదే ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ఈ ముఠా భారీ కుట్ర రచించినట్లు, ఇందుకోసం ఏకంగా 32 కార్లను సిద్ధం చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే పేలుడు పదార్థాల రవాణాకు ఉపయోగించిన మరో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు