సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి, దివంగత లెజెండరీ నటుడు కృష్ణను మరోసారి హృదయపూర్వకంగా స్మరించుకున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్ జరగనుంది. తన కెరీర్‌లోని ఈ ముఖ్యమైన సందర్భానికి ముందు, మహేశ్ బాబుకు తన తండ్రి గురించే ఎక్కువగా గుర్తొచ్చినట్లు కనిపించింది. తన జీవితంలో ప్రతి కీలక ఘట్టంలో తండ్రి లేరన్న బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ఈ సందర్భంగా మహేశ్ బాబు తన తండ్రితో ఉన్న ఒక పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఈరోజు మిమ్మల్ని నేను మరింతగా మిస్సవుతున్నాను నాన్న… మీరు గర్వపడతారని నాకు తెలుసు” అని ఆయన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. తండ్రిపై ఆయనకున్న అపారమైన ప్రేమను చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతూ, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.
మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు జరగనున్న ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ ద్వారా సినిమా కథ, కాన్సెప్ట్, పాత్రలు మరియు టెక్నికల్ టీమ్ వంటి కీలక వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ సినిమాకు సంబంధించిన ప్రపంచవ్యాప్త అంచనాలను మరింత పెంచనుంది.









