తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయంగా మళ్లీ చురుకుగా మారారు. కరూర్ ఘటన తర్వాత కొంతకాలం తగ్గిన ఆయన కార్యకలాపాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఈ సందర్భంలో, ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు (ECI) లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు నిర్వహించే సంప్రదింపుల సమావేశాలకు టీవీకే పార్టీకి కూడా ఆహ్వానం పంపాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. గుర్తింపు ఉన్నా లేకపోయినా, ప్రతి రాజకీయ పార్టీకి సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక సూత్రమని ఆయన ఈ లేఖలో స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా సవరణ, శాసనసభ ఎన్నికల సిద్ధత సమావేశాల వంటి కీలక అంశాలపై నిర్వహించే సమావేశాల్లో టీవీకేని నిర్లక్ష్యం చేస్తున్నారని విజయ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకేకి గట్టి బలం, ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఎన్నికల కమిషన్ సర్కులర్లు, నోటీసుల్లో పార్టీ పేరును ప్రస్తావించకపోవడం అసమానతకు దారితీస్తుందని ఆయన అన్నారు. సంప్రదింపుల సమావేశాల నుంచి టీవీకేని మినహాయించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల ముఖ్య వర్గం పాల్గోనే అవకాశాన్ని కోల్పోతుందని ఆయన హెచ్చరించారు. ఈ లేఖ ద్వారా, ఎన్నికల ప్రక్రియలో సమాన హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీవీకే సంపూర్ణ సహకారంతో ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యానికి తాము తోడ్పడతామని విజయ్ స్పష్టం చేశారు. ఈ న్యాయమైన అభ్యర్థనను పరిశీలించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల అధికారి మరియు తమిళనాడు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఈ లేఖ ద్వారా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన పార్టీ స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.









