సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. చనిపోయిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది వరకు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని కథనాలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడి, అవసరమైతే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ బజార్ ఘాట్‌కు చెందిన 18 మంది యాత్రికులు ఈ బస్సులో ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారి వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. ఈ మేరకు, ప్రమాద బాధితుల కుటుంబాలకు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు హైదరాబాద్‌లోని సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు: +91 79979 59754 మరియు +91 99129 19545 లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









