శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో మురళీ కాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దండోరా’ టీజర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, సామాజిక అంశాలు, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, కుల వివక్ష వంటి అంశాలే ప్రధానంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ‘చావుకు కూడా మ్యాచింగ్ డ్రెస్‌లు వేసుకోవాలని ఎవరు చెప్పారు?’ వంటి డైలాగ్స్, సర్పంచ్‌గా నవదీప్ దర్బం చూపించే సన్నివేశాలు కామెడీ టచ్‌తో ఆలోచింపజేసేలా ఉన్నాయి. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో బిందు మాధవి ‘శ్రీలత’ అనే పాత్రలో వేశ్యగా నటిస్తున్నారు. “ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని… వాళ్లు డబ్బులిస్తున్నారు… నేను వాళ్లకు సర్వీస్ చేస్తున్నా” అంటూ ఆమె శివాజీతో చెప్పే డైలాగ్‌తో టీజర్‌లో ఆమె పాత్రను పరిచయం చేశారు. పల్లెటూరి కామెడీ టచ్‌తో పాటు, సమాజంలో కుల వివక్షను సైతం హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్లే సన్నివేశం, ఆ సందర్భంగా వచ్చే ఎమోషనల్ సంభాషణలు ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయి. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నా లేదా వారికి ఎదురు తిరిగినా ఎదురయ్యే దౌర్జన్యకాండను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది.
‘దండోరా’ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యం, పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, వెటకారం, కామెడీ, ఎమోషన్ కలయికగా రూపొందుతోంది. చావు బతుకుల మధ్య మనిషి ఎదుర్కొనే పరిణామాలతో పాటు, సామాజిక అంశాలను టచ్ చేస్తూ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. శివాజీ, బిందు మాధవి, నవదీప్‌లతో పాటు రవికృష్ణ, మౌనికా రెడ్డి, అనూష, మనికా చిక్కాల, రాద్యా, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కె. రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.









