iBomma రవి కేసులో ఈడీ ఎంట్రీ: భారీ మనీలాండరింగ్‌పై విస్తృత దర్యాప్తు

iBomma పైరసీ వెబ్‌సైట్ మాస్టర్‌మైండ్ ఇమ్మడి రవి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టి సారించింది. తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టాలు కలిగించిన ఈ కేసులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ED అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో, కేసు వివరాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులను అందించాలని కోరుతూ ED అధికారులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌కు లేఖ రాశారు. ఈ సమాచారం ఆధారంగా, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ED విస్తృత దర్యాప్తును ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవి యొక్క 35 బ్యాంక్ ఖాతాలను గుర్తించి, అందులో ఉన్న రూ.3.5 కోట్లకు పైగా నగదును ఫ్రీజ్ చేశారు.

విశాఖకు చెందిన ఇమ్మడి రవి, iBomma వెబ్‌సైట్‌ను ప్రారంభించి, తెలుగు సినిమాలతో పాటు ఇతర ప్రాంతీయ చిత్రాలు, OTT కంటెంట్‌ను రిలీజ్ రోజే పైరేట్ చేసి అప్‌లోడ్ చేస్తూ వచ్చారు. iBomma తో పాటు 65 మిర్రర్ సైట్‌లు, Bappam TV వంటి ఎక్స్‌టెన్షన్‌ల ద్వారా తన వ్యవస్థను నడిపాడు. అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు లింక్‌లు ఇచ్చి, యూజర్లను డైవర్ట్ చేసి మరింత డబ్బు సంపాదించినట్లు పోలీసులు ఆరోపించారు. రవి తన పైరసీ కార్యకలాపాలను ట్రాక్ అవ్వకుండా ఉంచడానికి అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌ల మధ్య సర్వర్‌లను మార్చుకునేవాడు. భారతీయ పౌరసత్వాన్ని వదిలి సెయింట్ కిట్స్ పౌరుడిగా మారిన రవి, ఫ్రాన్స్‌లో నివసిస్తూ దుబాయ్, థాయ్‌లాండ్, USA మధ్య తిరుగుతూ ఉండేవాడు.

నవంబర్ 14న హైదరాబాద్‌కు వచ్చిన రవిని కుకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. iBomma ద్వారా రవి మొత్తం రూ.20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రవి NRE ఖాతాకు విదేశీ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు బదిలీ అయినట్లు, అలాగే నెలకు రూ.15 లక్షలు క్రిప్టో వాలెట్‌ల నుంచి ట్రాన్స్‌ఫర్‌లు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి, ఈ పైరసీ ఆదాయాలను డిజిటల్ కరెన్సీల ద్వారా దాచిపెట్టి, తిరిగి లీగల్ ఛానెల్స్‌కు మార్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కీలక ఆర్థిక లావాదేవీల అంశాలపై ED లోతుగా దర్యాప్తు చేసి, అక్రమ ఆస్తుల లెక్క తేల్చేందుకు సిద్ధమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు