ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొత్త చిత్రం ‘వారణాసి’ ప్రచార కార్యక్రమంలో రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల ధార్మిక భావాలను దెబ్బతీశాయని వారు ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో రాజమౌళి దేవుడిపై విశ్వాసం లేదని చిరాకు వ్యక్తం చేస్తూ చెప్పినట్లుగా ఫిర్యాదులో వానరసేన సభ్యులు పేర్కొన్నారు.
‘వారణాసి’ చిత్రం ప్రచారం సందర్భంగా రాజమౌళి చిన్ననాటి విషయాన్ని ప్రస్తావించారు. చిన్నప్పుడు తన తండ్రి “హనుమంతుడు వెనకనుంచి నడిపిస్తాడు” అని చెప్పిన విషయాన్ని ఆయన అక్కడ ప్రస్తావించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు తమకు అభ్యంతరకరంగా అనిపించాయని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజమౌళి వ్యవహరించారని వానరసేన సభ్యులు తెలిపారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకుగాను రాజమౌళిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రీయ వానరసేన సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.









