పైరసీ కేసులో ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ: నాంపల్లి కోర్టు ఆదేశాలు

సినిమా పైరసీ చేసి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్న ఐబొమ్మ (iBomma) కేసులో అరెస్టయిన కీలక నిందితుడు ఇమ్మడి రవికి (Immadi Ravi) నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు అతడిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరగా, కోర్టు ఐదు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. భారత పౌరసత్వాన్ని వదులుకుని కరీబియన్ దీవుల్లో నివసిస్తున్న ఇమ్మడి రవి, ఇటీవల భారత్‌కు రాగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని ట్రాక్ చేసి కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కొత్త సినిమాలు విడుదల కాగానే లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ కాగానే వాటిని పైరసీ చేసి, ఐబొమ్మ, బప్పం టీవీ సహా అనేక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ పైరసీ రాకెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడేళ్లుగా ఇమ్మడి రవి ‘ఐ బొమ్మ’, ‘బప్పం’, ‘ఐ విన్’, ‘ఐ రాధ టీవీ’ వంటి పేర్లతో వెబ్‌సైట్లను నడుపుతూ సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. అతడి నివాసంలో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోర్టు అనుమతితో ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు, ఈ పైరసీ వ్యవహారం వెనుక ఉన్న మరిన్ని కీలక అంశాలను రాబట్టాలని చూస్తున్నారు. అతడి విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ప్రవేశించింది. రవి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడా లేదా అనే కోణంలో ఈడీ దర్యాప్తు జరపనుంది. ఈ పైరసీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు