ఢిల్లీ కారు పేలుడు: ఆల్ ఫలా విశ్వవిద్యాలయం నుంచి 10 మంది మిస్సింగ్?

ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో అధికారులు ఆల్ ఫలా విశ్వవిద్యాలయం (Al-Falah University) వ్యవహారాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కనిపించకుండా పోయిన ఈ వ్యక్తుల ఫోన్‌లు ప్రస్తుతం స్విచ్ఛాఫ్ వస్తున్నాయని సమాచారం. ఈ పది మందిలో ముగ్గురు కశ్మీరీ వాసులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కేసులో అరెస్టయిన నిందితులకు ఈ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్నట్లు విచారణలో బయటపడింది. తాజాగా, పదిమంది కనిపించకుండా పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కనిపించకుండా పోయిన వీరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో, ఢిల్లీలోని పేలుడు ఘటనతో పాటు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌తో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఢిల్లీ కారు పేలుడు కేసు విచారణలో ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు వైద్యులు సహా మొత్తం తొమ్మిది మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు