తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి పైరసీ కేసులో తాజాగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్‌క్రైమ్ అడిషనల్ ఏసీపీ శ్రీనివాస్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. గత ఆరేళ్లలో పైరసీ ద్వారా ఐబొమ్మ రవి రూ. కోట్ల అక్రమ సంపద కూడబెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా, అతడు వెబ్‌సైట్లను ‘ఎన్‌జల’ కంపెనీ నుంచి హోస్ట్ చేశాడని, గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ చేస్తూ ఏకంగా రూ. 20 కోట్లు సంపాదించాడని ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఐబొమ్మ రవి కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా తన వెబ్‌సైట్‌లలో సినిమాలు పోస్ట్ చేసేవాడని ఏసీపీ శ్రీనివాస్ వివరించారు. ఎవరైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే అది గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో స్క్రిప్ట్ రాసేవాడని తెలిపారు. అలాగే, భవిష్యత్‌లో రాబోయే వెబ్-3 టెక్నాలజీ ద్వారా పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టమని భావించి, తాను ఎప్పటికీ దొరకనని ఐబొమ్మ రవి ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడని ఏసీపీ వెల్లడించారు.
రవి అరెస్ట్‌పై వచ్చిన పుకార్లను ఏసీపీ శ్రీనివాస్ ఖండించారు. అతడు విడాకుల పనిమీద హైదరాబాద్ వచ్చాడని, అతడి భార్య సమాచారం ఇవ్వడం వల్ల పట్టుబడ్డాడనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. రవి భార్యకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెను ఇంతవరకు తాము విచారించలేదని చెప్పారు. దర్యాప్తు చాలా సంక్లిష్టంగా ఉందని, ఐబొమ్మ రవి ఈజీ మనీకి అలవాటు పడి, లక్ష డాలర్లు ఇచ్చి కరేబియన్ దీవుల పౌరసత్వం కొనుగోలు చేశాడని ఏసీపీ తెలిపారు.









