తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే అవకాశం కనిపించడం లేదనే అంచనాలు పెరుగుతున్నాయి. కొంత కాలం క్రితం హరీశ్ రావు, సంతోష్ రావుల పై విమర్శలు చేసిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి కేవలం సస్పెండ్ మాత్రమే చేసింది. భవిష్యత్‌లో సస్పెన్షన్ ఎత్తివేస్తారని, తిరిగి కవితను పార్టీలోకి తీసుకునే అవకాశాలుంటాయన్న అంచనాలున్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. రాను రాను ఆమెపై సస్పెన్షన్ మాత్రమే కాకుండా, ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించే ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే పార్టీ నేతలు కూడా ఆమెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఉండటం, బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవితలు సహజంగానే కీలక స్థానాల్లో ఉండటం వంటి కారణాల వల్ల, కవితపై సస్పెన్షన్ వేటు వేసినా భవిష్యత్తులో ఎన్నికలకు ముందు ఎత్తివేసే అవకాశాలున్నాయని అందరూ అంచనా వేశారు. గతంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం కవితపై విమర్శలు చేసినప్పుడు కొంత జాగ్రత్తలు పాటించి, దూషణ భూషణలకు దిగకుండా, తనపై చేసిన విమర్శలకు మాత్రమే సమాధానమిచ్చారు.
కానీ ఇప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా కల్వకుంట్ల కవితను “లిక్కర్ రాణి” అని సంబోధించడం చూస్తుంటే, ఖచ్చితంగా పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. పార్టీ అధినేత కుమార్తెను అంత ధైర్యంగా విమర్శించారంటే, కవితకు ఇక బీఆర్‌ఎస్‌లోకి నో ఎంట్రీ అని చెప్పవచ్చని పార్టీ కింది స్థాయి కార్యకర్తల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే, పార్టీ నుంచి ఆమెను బహిష్కరిస్తున్నట్లు త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నది ముఖ్య నేతల అభిప్రాయంగా తెలుస్తుంది.









