ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు. ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా, ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు గాను కామన్ వాల్‌తో ఇల్లు కట్టుకోవడానికి అనుమతినిస్తూ ప్రత్యేక జీవోను కూడా జారీ చేస్తామని మంత్రి తెలిపారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సుమారు మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. రాబోయే ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకే, ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.









