భారత క్రికెట్ జట్టు టెస్టు ప్రదర్శనపై మాజీ కెప్టెన్, దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవం, అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో ఓటమి కేవలం మామూలు ఫలితాలు మాత్రమే కావని, జట్టులో అంతర్లీనంగా ఉన్న లోతైన సమస్యలకు అద్దం పడుతున్నాయని విశ్లేషించారు. టెస్టు క్రికెట్‌కు సరిపోయే దృక్పథాన్ని ఆటగాళ్లు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జట్టులో సమూల మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయి, దక్షిణాఫ్రికా చేతిలో 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పరుగుల పరంగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమి. అంతేకాకుండా, స్వదేశంలో ఆడిన చివరి ఏడు టెస్టుల్లో భారత్‌కు ఇది ఐదో పరాజయం. ఈ విజయంతో సౌతాఫ్రికా సుదీర్ఘకాలం తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచింది. ఈ ఫలితాలపై కుంబ్లే తన విశ్లేషణను పంచుకున్నాడు.
“సౌతాఫ్రికాతో ఓటమి, న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోవడం వంటివి కేవలం ఫలితాలకే పరిమితం కావు. ఇవి జట్టులోని విస్తృత సమస్యలను సూచిస్తున్నాయి. భారత జట్టు కొన్ని సందర్భాల్లో మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపించినా, చివరికి చేతులెత్తేసింది. తరచూ తుది జట్టులో మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్‌లో సర్దుబాట్లు, ఆటగాళ్ల రొటేషన్ వంటివి జట్టులో నిలకడ లేకుండా చేస్తున్నాయి. ఈ ఓటమిపై భారత్ లోతుగా సమీక్షించుకోవాలి,” అని కుంబ్లే అన్నారు.









