తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) విషయంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఓఆర్ఆర్ లేదా విద్యుత్ కొనుగోళ్లలో ఐదు రూపాయల అవినీతి కూడా జరగలేదని, తెలంగాణ సమాజం మంచి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు బయట ఉంచడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికారంలోకి వస్తే మారుస్తామని కొందరు చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ, “వారు అధికారంలోకి వచ్చేది లేదు, మార్చేది లేదు” అని మంత్రి తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోందని ఆరోపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనవసర ఆరోపణలను మానుకుని ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో సహకరించాలని కోరారు. చివరగా, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సవాల్ విసురుతూ.. పైసా అవినీతి జరిగిందని నిరూపించినా తాను ఏం చేయడానికైనా సిద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.









