టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారని సమాచారం. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ప్రేమ కథ నడుస్తోందన్న వార్తలు నిజమయ్యేలా సోమవారం తెల్లవారుజామున వారు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు, ఈ జంట వివాహం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ పరిసరాల్లో ఉన్న ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకను ఎలాంటి హంగామా లేకుండా, పూర్తిగా వ్యక్తిగతంగా నిర్వహించినట్టు సమాచారం. పెళ్లిలో సమంత ఎరుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపించింది. అయితే ఇందుకు సంబంధించి సమంత, రాజ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజు సాయంత్రంలోగా సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలో మొదలైనట్లు సమాచారం. ఈ సమయంలో బలపడిన వీరి స్నేహం వ్యక్తిగత అనుబంధంగా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా కలిసి ట్రిప్పులకు వెళ్లడం, ఈవెంట్లలో క్లోజ్‌గా కనిపించడం వంటివి డేటింగ్ రూమర్లకు ఊతమిచ్చాయి. తాజాగా ఈ వివాహ వార్తతో అభిమానులు, నెటిజన్లు సోషల్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.









