కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు తన కారులో ఒక కుక్కపిల్లతో రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ కు వస్తుండగా దారిలో ప్రమాదానికి గురయ్యేలా ఉన్న కుక్కపిల్లను కాపాడి తీసుకువచ్చానని, వెంటనే దానిని కారులోనే ఇంటికి పంపించానని ఆమె మీడియాకు తెలిపారు. “ఒక జీవి ప్రాణాన్ని కాపాడితే తప్పేంటని, పార్లమెంట్ కు కుక్కపిల్లను తీసుకురావొద్దని ఏదైనా చట్టం ఉందా?” అని ఆమె ప్రశ్నించారు.
కుక్కపిల్ల విషయంపై వివరణ ఇస్తున్న క్రమంలోనే, రేణుకా చౌదరి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దానితో ఎలాంటి సమస్య లేదా? నేను ఒక జంతువును కాపాడితే అది పెద్ద చర్చ అవుతుందా?” అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.
రేణుకా చౌదరి వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ, రేణుక తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని ఆరోపించారు. ఇది పార్లమెంట్ ను, ఎంపీలను అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్న షెహజాద్ పూనావాలా, రేణుకా చౌదరి దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.









