కర్ణాటక రాజధాని బెంగళూరు నగర రహదారులు, ట్రాఫిక్ జామ్‌లపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉందని విమర్శించిన ఆయన, ఇక్కడి పోలీసులు నిష్ప్రయోజకులని (‘యూజ్లెస్’) అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై ఆయన సామాజిక మాధ్యమ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఆదివారం తాను ఢిల్లీ బయలుదేరిన సమయంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్లు ఎంపీ రాజీవ్ రాయ్ తెలిపారు. అంతేకాక, వాహనాల రద్దీని క్లియర్ చేయడానికి రహదారిపై ఒక్క పోలీసు కూడా కనిపించలేదని ఆయన విమర్శించారు. విమానాశ్రయానికి సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో తాను బెంగళూరు పోలీసులను సంప్రదించినా, వారు స్పందించలేదని ఆయన ఆరోపించారు.
బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ సరిగ్గా లేదని రాజీవ్ రాయ్ అన్నారు. అందమైన నగరంగా ప్రఖ్యాతి గాంచిన బెంగళూరు అసమర్థ అధికారుల కారణంగా అపఖ్యాతిని మూటగట్టుకుంటోందని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ విభాగం పట్టించుకోవడం లేదని, దీంతో అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.









