దిత్వా తుపాను బలహీనపడినప్పటికీ, దాని ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోనూ దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను కారణంగా శ్రీలంకపై ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశంలో ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) ముప్పు పొంచి ఉందని ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో దిత్వా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను తీరం దాటకుండా బలహీనపడుతున్నప్పటికీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
తెలంగాణలో దిత్వా తుపాను వాయుగుండంగా మారినా, ఆ ప్రభావంతో మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించారు. దిత్వా ప్రభావం కారణంగా చలి తీవ్రత మళ్లీ పెరిగి, ఏజెన్సీ ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.









