జర్మనీ ప్రభుత్వం భారతీయ యువతకు శుభవార్త అందించింది. తమ దేశంలో పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ మరియు వృద్ధాప్య జనాభా కారణంగా ఏర్పడిన శ్రామిక శక్తి కొరతను అధిగమించేందుకు, ఏకంగా 6 లక్షల మంది భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. ఇంజినీరింగ్, ఐటీ, హెల్త్, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతతో జర్మనీ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
ఈ ఉద్యోగాల కొరతను అధిగమించడానికి జర్మనీ ప్రభుత్వం తమ ఇమ్మిగ్రేషన్ విధానాలను సమూలంగా మార్చేసింది. వీసా నిబంధనలను సులభతరం చేయడంతో పాటు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) బ్లూ కార్డ్ జీతం అవసరాలను తగ్గించడం, కొత్తగా ఆపర్చునిటీ కార్డ్ (Opportunity Card) ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంది. ముందస్తు ఉద్యోగ ఆఫర్ లేకుండానే విదేశీ నిపుణులు జర్మనీకి వచ్చి పని వెతుక్కోవడానికి ఈ ఆపర్చునిటీ కార్డ్ అనుమతిస్తుంది.
ఈ టాలెంట్ వ్యూహానికి జర్మనీలోని అగ్రశ్రేణి టీయూ9 యూనివర్సిటీలు కేంద్రంగా నిలుస్తున్నాయి. ఈ యూనివర్సిటీలు AI, రోబోటిక్స్, పునరుత్పాదక శక్తి వంటి అత్యంత డిమాండ్ ఉన్న STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాలకు అనుగుణంగా కోర్సులను అందిస్తున్నాయి. అనేక అగ్రశ్రేణి జర్మన్ యూనివర్సిటీలు దాదాపు జీరో ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తుండటం భారతీయ విద్యార్థులకు భారీ ప్రపంచ అవకాశంగా నిలుస్తోంది.









