మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైలెంట్ మోడ్: వైసీపీ హైకమాండ్‌లో అసహనం?

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, ఉత్తరాంధ్రలో కీలక నేత అయిన తమ్మినేని సీతారాం ప్రస్తుతం అసాధారణంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన సీతారాం, తన సొంత నియోజకవర్గమైన ఆముదాలవలసలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా స్పందించకపోవడంపై వైసీపీ హైకమాండ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒక సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్త సమస్యలపై ఉద్యమించాల్సిన సమయంలో, కనీసం నియోజకవర్గ సమస్యలపైనా దృష్టి పెట్టకపోవడంపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఉందని తెలుస్తోంది.

గతంలో ఐదేళ్లపాటు స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని సీతారాం, రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉన్నారు. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల మీదుగా వచ్చి వైసీపీలో స్థిరపడిన ఆయన, 2019లో ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, తన సమీప బంధువు అయిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కనీసం విమర్శలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రాజకీయాల్లో ఓటములు సహజమైనా, పార్టీని వదిలేసినట్లుగా సైలెంట్‌గా ఉండటం సరికాదనే ప్రశ్న క్యాడర్ నుంచి వినిపిస్తోంది.

అనంతరం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జగన్ నియమించినప్పటికీ, సీతారాం చురుకుగా లేకపోవడం గమనార్హం. ఆయన వైఖరిపై విమర్శలు, సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీని వీడి వేరే పార్టీలో చేరే అవకాశం లేదనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి, ఎన్నికలకు ముందు మాత్రమే బయటకు వచ్చి క్రియాశీలకంగా మారాలని ఆయన చూస్తున్నాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, సీనియర్ నేత తమ్మినేని సీతారాం మౌనం మాత్రం వైసీపీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు